Sunday 6 November 2011


మన తెలుగును కాపాడుకోవడమెలా?


భాషను కాపాడుకోవడం, భాషలో అభివ్యక్తి నైపుణ్యాలు పెంచుకోవడం, భాషను బోధనభాషగా, పరిపాలనా భాషగా మార్చుకోవడం వంటివి ఈ కాలంలో సాధ్యమయ్యే అంశాలేనా? ఎవరో ఒకరు వీటిని పట్టించుకోకపోతే ముందుతరాలకు ఈ సంస్కృతి, సాహిత్యం అందేదెలా? ప్రతి కాలంలోనూ ఈ అంశాలపై చర్చ జరుగుతూనే ఉంటుంది. గిడుగు పిడుగులా గ్రాంధిక భాషావాదులపై విరుచుకుపడితేనే వ్యావహారిక భాషోద్యమం వచ్చింది. దాని ఫలాలే మనం అనుభవిస్తున్నాం. భాష ఆయా కాలాల్లో, ఆయా ప్రజల కాంక్షలకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. ఈ అంశాలపై తెలుగు అకాడమీ పూర్వ సంచాలకులు డా. వెలిచాల కొండలరావు ఇటీవల ఎంతో కృషిచేశారు. ఈ అంశాలపై అందర్నీ చైతన్యపరచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ మూడు అంశాలపై ఆయన మనోభావాలు, అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 
తెలుగును కాపాడుకోవడం ఎలా? 
ఏ భాష అయినా ఆ భాష మాట్లాడేవారికి ఒక సంస్కారాన్ని, ఒక సంస్కృతిని, వాటికి సంబంధించిన విలువలను అందిస్తుంది. ఆ విలువలు, విశ్వాసాలు మఖలో పుట్టి పుబ్బలో పతనమయ్యేవికావు. అవి ఆ ప్రజల నరనరాల్లో జీర్ణించుకొని ఉంటాయి. భాష అనేది ఒక జాతి వ్యక్తిత్వానికి, అస్తిత్వానికి ప్రతినిధిగానే ఉంటుంది. అది నిత్యస్రవంతి. ఎప్పటికప్పుడు అత్యంత ఆధునికంగా మారే గుణం కూడా దానికి ఉంటుంది. అందువల్ల మన భాషను మనం కాపాడుకుంటూనే ఇంగ్లిషు వంటి భాషల్ని నేర్చుకోవాలేకానీ, మన భాషని విస్మరించి కాదు. మన భాషను మనం మాట్లాడలేకపోతే, దానిలో అభిప్రాయాలు వ్యక్తీకరించలేకపోతే అంతకన్నా నష్టం మరొకటి లేదు. ఏ పరాయి భాషనైనా నేర్చుకొని అందులో అందరూ మెచ్చేలా వ్యక్తీకరించేవారు తమ భాషపై కూడా వారు పట్టు సాధించే ఉంటారన్న వాస్తవాల్ని గ్రహించాలి. ఇంగ్లిషు భాషని మనం ఎంతగా నేర్చుకున్నా, ఇంగ్లిషు భాష మాతృభాషగా ఉన్నవారు మాట్లాడినట్లు మాట్లాడ్డం, వాళ్ళు రాసినట్లు రాయడం, అతికొద్ది మందికి తప్ప అందరికీ సాధ్యంకాదు. ఈ దేశంలో రెండు విధాలైన ఛాందస వాదులున్నారు. కేవలం ఇంగ్లిషు మాత్రమే కావాలనే వారు, లేదా తెలుగు మాత్రమే కావాలనేవారు. రెండు వర్గాల వాదనలూ అప్రస్తుతమే. ఆ వాదాలు అసమంజసం. ఈ కాలానికి విరుద్ధం ఇంగ్లిషు భాష బతుకు తెరువుకోసం ఎంతైనా అవసరమే. అలాగే మన భాష, సంస్కృతి, ఆత్మగౌరవం, దేశీయత, ఆత్మ విశ్వాసం, వ్యక్తిత్వం నిలవాలంటే తెలుగు కూడా ఉండాల్సిందే. అందువల్ల- 
* తెలుగుకు ఇంగ్లీషుకు సమానస్థాయి కల్పించాలి. 
* చిన్న తరగతుల్లో తెలుగు ద్వారా ఇంగ్లిషు నేర్చుకొనే విధానాన్ని ప్రోత్సహించాలి. 
* ఉభయ భాషా ప్రవీణులను తయారుచేసేలా కోర్సులు రూపొందించాలి. 
* ఇతర రాష్ట్రాల్లో అమలుచేస్తున్నట్లు తెలుగు మీడియంలో చదివిన వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ సదుపాయాలు కల్పించాలి. 
బోధనభాష X పరిపాలనా భాష 
ఏ భాషకైనా పరిపాలనా భాషగా అమలుచేయాలంటే ఆ భాష మామూలు భాషగానే కాక సకల వ్యవహారాలకు ఉపయోగపడే భాషగా కూడా ఉండాలి. అంటే 'పరిభాష' అన్నమాట. ఇంకా విపులంగా చెప్పుకోవాలంటే ఆ భాష అన్నిరంగాలకు, వృత్తులకు, విషయాలకు, పనులకు వర్తించే భాషగా ఉండాలి. 
* మామూలు భాష అంటే అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, విద్యాధికులు కానివారు కూడా మాట్లాడగలిగేది, అర్థం చేసుకోగలిగేది అన్నమాట. 
* పరిభాష అంటే- చాలావరకు విద్యల ద్వారా, విద్యాలయాల ద్వారా నేర్చుకోవలసిన భాష. ఇంకా అనేక శాస్త్రాలు, చట్టాలు అన్నీ ఇంగ్లిషులోనే ఉన్నాయన్నది వాస్తవం. 
* తెలుగుభాష ప్రస్తుతం పరిపాలనా భాషగా మారాలంటే ముందు దాన్ని అన్ని అవసరాలకు వాడుకోవాలి. కానీ చిత్రమేమిటంటే ఇప్పటికీ తెలుగును ఉన్నతావసరాలకు వాడడంలేదు. ప్రభుత్వం తన సంప్రదింపులు, కార్యకలాపాలన్నీ ఇంగ్లిషులోనే సాగిస్తోంది. న్యాయవస్థ సైతం ఇంగ్లిషునే వాడుతోంది- ఇది కొన్ని ఉదాహరణలు మాత్రమే. 
* తెలుగు పరిపాలన భాష అయితేనే కానీ బోధన భాషగా ఆదరణ పొందలేదు. బోధన భాష అయితేనే కానీ పరిపాలన భాష కాలేదు. రెండూ పరస్పరం ఒకదానిమీద మరొకటి ఆధారపడి ఉన్నాయి. తెలుగు బోధనభాష అయితేనే తప్ప పరిపాలనా భాష కాలేదు. 
* మన రాష్ట్రాన్ని భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పరచుకొన్నపుడే తెలుగు ఈ రాష్ట్రానికి పాలన భాష, బోధనభాష అవుతుందని ఆశించాం. కానీ ఇన్నేళ్లు గడచిపోయినా ఆ దిశగా సాధించింది మాత్రం చాలా స్వల్పం. 
* ఇంగ్లిషు భాష రాకపోతే అభివృద్ధి లేదనేవారు కొన్ని విషయాలు గుర్తించాలి. జపాన్‌, చైనా, ఫ్రాన్స్‌, రష్యా, జర్మనీ, కొరియా... ఈ దేశాలన్నీ ఇప్పటికీ తమ మాతృ భాషల్లోనే బోధన, పాలన సాగిస్తున్నాయి. మరి అవి అభివృద్ధి చెందలేదనగలమా? 
* ఇంగ్లిషు భాష నేర్చుకోకపోతే విదేశాల్లో ఉద్యోగాలు దొరకవనడానికి విదేశాల్లో ఉద్యోగాలు పొందుతున్న వారి శాతం ఎంత? సగటు ఉద్యోగాల్లో స్వల్పశాతమే! మరి ఇంగ్లిషు పట్ల మక్కువ, సొంత భాషపట్ల తిరస్కారం దేనికి? 
* దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో వారు వారి భాషల పట్ల చూపుతున్న మక్కువ, దీక్ష, అంకితభావం మనలో ఎందుకు కొరవడ్డాయి? ఇది తక్షణం ఆలోచించాల్సిన విషయం. అంతేకాదు సరిదిద్దుకోవలసినది కూడా. 
* అభివృద్ధి కౌశలాలు (కమ్యూనికేషన్‌ స్కిల్స్‌) అనగానే ఇంగ్లిషు భాషలో మాట్లాడ్డం వంటివేనా? తెలుగులో మాట్లాడ్డం, రాయడం, ప్రదర్శించడం అవసరంలేదా? 
* తెలుగును బోధన భాషగా, పరిపాలనా భాషగా చేయడానికి ప్రభుత్వంతోపాటు అన్ని సంస్థలు, మేధావులు కంకణం కట్టుకోవాలి. 
భాషా సాహిత్యాలు, అభివ్యక్తి నైపుణ్యాలు 
కమ్యూనికేషన్‌ స్కిల్‌ అనేది తెలుగులో కూడా అవసరం అన్నది అందరూ గుర్తించాలి. తెలుగు భాష, దాని స్వరూపం, వ్యాకరణం, ఛందస్సు వంటివి తెలిసి, తెలుగులో సుప్రసిద్ధుల రచనలు చదివినపుడు తప్పక కౌశలం కలుగుతుంది. అప్పుడే భాషను సవ్యంగా వాడడం అలవడుతుంది. అంతేకానీ భాషలో మాట్లాడగలిగేంత పరిజ్ఞానం మాత్రమే ఉంటే అభివ్యక్తి నైపుణ్యం కలగదు. ఈ రోజు వివిధ మీడియాల్లో ఉన్నవారు పైపై మాటలతో పబ్బం గడుపుకొంటున్నా దీర్ఘకాలం వారు అందులో రాణించలేరు. అంటే భాషానైపుణ్యం సాధించాలనుకొనేవారు 'సాహిత్యభాష'ను అలవరుచుకోవాలి. సాహిత్యభాష అంటే అలంకారాలు, ఉపమానాలు, ఉత్ప్రేక్షలు, సాహిత్యంలోంచి సూక్తులు, పద్య, గేయ భాగాలు, సామెతలు, పలుకుబడులు, ప్రతీకలు, నానుడులు వంటివి ఉదహరించగల శక్తియుక్తులు కలిగించే భాష. ఆ శక్తి యుక్తులున్నవారే తమ మాటలు, ఉపన్యాసాలు, వ్యాఖ్యానాల ద్వారా ప్రజల్ని ఆకట్టుకోగలరు.

No comments:

Post a Comment