Wednesday 23 November 2011

నాకూ ఆదివారమొస్తుంది

తెల్లవారితే ఆదివారం. మనసివాళనుంచే పిల్లిమొగ్గలెసేస్తోంది. తూనిగలా అటూ ఇటూ పరుగులు పెట్టేస్తోంది. ఎంచక్కా ఏడింటి వరకూ తలగడమంత్రాలు చదువుకోవొచ్చు... అనుకునే లోపు ఐదింటికే కనురెప్పల అలికిడి మొదలయ్యింది. అదేం మాయదారి నిద్దురో ఎప్పుడూ అదే అల్లరి శలవని ముందే తెలుసున్నట్ట్లు తనే ముందు శలవు ప్రకటించేస్తుంది తుంటరి సూరీడుపై అలిగినట్టుగా.. ఇక తప్పేదేముంది... మంచం దిగక చేసేదేముంది!!! అత్యంత ప్రీతిపాత్రమైన ఆ కాస్త కాఫీ గొంతులో ఒంపుకుని జనాభా అంతా లేచేలోపు కనీసం ఎనిమిదింటివరకైనా మనకోసం మనం బ్రతుకుదాం అనుకునేలోపు... టిఫిన్, వంట, పనిమనిషి (వస్తేనే...) ఆపై వాషింగ్ మెషిన్...

        రెండయింది. లంచ్ అయేసరికింకో గంట. ఆరేసిన బట్టలు తెచ్చి మడతలు పెట్టుకోవడం. ఇస్త్రీ బట్టలు సర్దుకోవడం. వారానికి సరిపడే కూరలు తెచ్చుకోవడం. దాంతో అయిపోయింది నాలుగు. ఆదివారం అనగానే పరుగులెత్తుకుంటూ వచ్చే అనౌచిత్య అతిధుల కోసమ్ ప్లాస్టిక్ నవ్వులు అతికించుకుంటూ అలసిన ఎద కన్నీళ్ళు పెట్టుకుంటుంటే ఓదార్చలేని తపనలు మదినిండా ముళ్ళై గుచ్చుకుంటుంటే... ఇంకేముందీ... సాయంత్రం వంటకి వేళయ్యింది. టీ వీ లో వచ్చే బ్లాక్ అండ్ వైట్ మూవీ చూడనీయని నెపోలియన్ కాలం నాటి క్రికెట్టులతో చీకటి చిక్కగా పరుచుకుంటుంది అచ్చం ఎదలో లానే.

        మరల ఓ గుప్పెడు మెతుకులు రోజూ లానే ఆదరా బాదరా తినేసి ఓ తిలక్ నో, ఓ ఠాగూర్ నో పలకరిద్దామనుకునే వీలు లేదు. పక్క పక్కనే కాపురాలయినా చుట్టాలు డిన్నర్ కి కూడా తయారు. మనసుకెక్కని కబుర్లతో భోజనాలయేసరికి రాత్రి 10:30. అలిసిన మనసు కనురెప్పలకు మాత్రం ఫెవికాలు అంటించినా మూతబడని కన్నులు... అస్సలు దరి చేరనీయని మెత్తని నిదురమ్మ ఒడి. మనసు ఆకలి తీరకుంది. అనవసర ఆలోచనల సుడిగుండాలు అర్ధంతరంగా వచ్చి పనున్నట్లు తిష్టేసేస్తున్నాయి. ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి???

        అవును మరి ఎద దప్పికతో ఉంది. వినపడని రఫీ, కిషోర్ ల స్వరాలకై తపిస్తూ... కనపడని కృష్ణ శాస్త్రులనూ, అమృతం కురియని రాత్రులనూ తలుచుకుంటూ ఆలపించలేని గీతాంజలులకూ తెరువబడని గాలిభ్ గీతాలకూ మూతబడని మనసును నివేదిస్తూ తీరని ఆ కోరికలతో బాటే తీరికను కూడా మరుస్తూ... జీవించేస్తున్నాను... కాదు జీవిస్తున్నాననుకుంటూ బ్రతికేస్తున్నాను మళ్ళీ ఆదివారం ఉంది కదా అని ర్యాక్ లోని అక్షర సంపదను అక్కడే దాచిపెట్టుకుంటూ... గుండె పలికే గీతాలను మూసి ఉంచిన సీడీల్లో నిశ్శబ్దంగా వింటూ...

2 comments: