Wednesday 23 November 2011

అక్షరం తలదించుకున్న వేళ

కొత్త నెలని గుర్తు చేస్తూ ఆ పత్రిక వచ్చింది. ఎప్పటిలాగే ఏముందా అని ఒక్కసారి పేజీలు తిప్పాను. సాధారణంగా పత్రిక రాగానే ఆసాంతం చదివేస్తాను. రాత్రి పడుక్కోబోయే ముందు చదవుతాను కదా అని ప్రతీ శీర్షికా ఓపిగ్గా చూడలేదు. రాత్రి చదువుదామని పుస్తకం తెరిచి సంపాదకీయం దగ్గరే ఆగిపోయాను. పేజీలు తిప్పానుకానీ, చదవబుద్ధి కాలేదు. అప్రయత్నంగా కళ్ళు చెమ్మ గిల్లాయి. మనసంతా
 స్థబ్ధుగా అయిపోయింది. ఆ గదంతా విషాదం ఆవరించింది. గత అయిదేళ్ళుగా అప్రతిహతంగా అమెరికాలో వెలువడే ఒక పత్రిక ఇహ రాదన్న భావనే ఆ స్థితికి కారణం. అయిదేళ్ళ జన్మదిన సంచికే ఆఖరి సంచికగా మారిన ఆ పత్రిక తెలుగు నాడి. జంపాల చౌదరి గారి సంపాదకత్వంలో వస్తున్న ఆ పత్రిక వెనక ఎంతో మంది సాహితీకారులున్నారు. అందరూ కలిసి ఇన్నాళ్ళూ నడిపించారు.
కేవలం సంపాదకీయం చదివితేనే నా కిలా అనిపిస్తే, అది రాసిన వ్యక్తి పరిస్థితి ఊహించగలను. అది సంపాదకీయం కాదు. ఒక వీడ్కోలు. ఒక విషాదం. ఒక అయిష్ట నిష్క్రమణ. అయిదేళ్ళ శ్రమకి అర్థాంతరంగా ముగింపిస్తూ చేతులెత్తేసిన ఆవేదన. నీరు పోసి పెంచీ, పూలు పూస్తున్న మొక్కని స్వహస్తాలతో పెకలిస్తున్న బాధ. అది చదివి మనిషిగా బాధ పడ్డాను. తెలుగు వాడిగా సిగ్గుపడ్డాను. నన్ను చూసి అక్షరం
 తలదించుకుంది.
కర్ణుడి మరణానికి సవాలక్ష కారణాలుండచ్చు కానీ, ఒక పత్రిక అర్థాంతరంగా ఆగిపోడానికి కారణం మాత్రం ఖచ్చితంగా పెట్టుబడే! అందునా అచ్చు పుస్తకానికి ఊపిరి డబ్బే! అది లేకపోతే ఎంత మంచి సాహిత్యమున్నా వెలుగు చూసే అవకాశముండదు. సభల్లోనూ, వేదికలెక్కీ తెలుగు భాషని బ్రతికించుకోవాలీ, కాపాడుకోవాలీ అంటూ ఊక ఉపన్యాసాలిచ్చే తెలుగు వారు ఎక్కువే! ముఖ్యంగా అమెరికాలాంటి దేశంలో
 తెలుగు వారి గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. అథమపక్షం ఊరికి రెండో మూడో తెలుగు సంఘాలుంటాయి. సాహిత్యమూ, సంస్కృతీ అంటూ గొంతెత్తి అరుస్తాయి. ఇండియాలో పత్రికల్లో ఫొటోలు వేయించుకుంటాయి. ఆహా, ఓహో అంటూ రాయించుకుంటాయి. అంతవరకే! అమెరికాలో ఒక తెలుగు పత్రిక ఇక్కడి ఇంగ్లీషు పత్రికలకి ధీటుగా ప్రచురింప బడుతోందీ, ఏడాదికి కేవలం 24 డాలర్లు మాత్రమే - పుస్తకం మీ ఇంటికి మెయిల్
 చెయ్యబడుతుందని చెప్పినా ఎవరూ ముందుకు రారు. ఎందుకంటే తెలుగు వారికి పుస్తకాలు చదివే అలవాటు తక్కువ. ఉన్న కొద్ది మందీ పక్కవాడు పుస్తకం కొంటే తీరుబడిగా తిరగేస్తారు తప్ప, ఓ డాలరు ఖర్చు పెట్టి కొనరు. ఇదీ తెలుగువారి దౌర్భాగ్యం.
అమెరికాలో సుమారు రెండు లక్షల పై చిలుకు తెలుగు వారున్నారు. ఒక్క సిలికాన్ వేలీ లోనే డెబ్భై వేల మందున్నారు. కనీసం ఇందులో నాలుగో వంతు జనాభా ఈ తెలుగునాడి పుస్తకం కొన్నా, ఈ పత్రిక మూత పడే అవకాశం ఎంతమాత్రమూ రాదు. ఇహ వ్యాపార ప్రకటనలు. కనీసం వందమంది వ్యాపారవేత్తలు తలో చేయీ వేసినా చాలు. కానీ ఎవరూ ముందుకురారు. ఇహ తెలుగు సంఘాలూ అంతే! వేలకు వేలు ఖర్చు పెట్టి సినిమా వాళ్ళని
 తెచ్చుకునే దాంట్లో పదోవంతయినా ఇలాంటి పత్రిక నిలపడానికి వెచ్చిస్తే ఈ పరిస్థితి రాదు.
తెలుగు వాళ్ళకి ఆత్మాభిమానం తక్కువ. మనది అన్న భావన లేదు. మన సాహిత్యమన్నఅభిమానం అంతకన్నా లేదు. దేశం మారినా పాత అలవాట్లు పోవు. మనస్తత్వం మారదు. నిజానికి ఏడాదికి 24 డాలర్లు అమెరికాలో ఉండే తెలుగు వారికేమంత ఎక్కువ కాదు. ఇక్కడా ఎక్కువా తక్కువా అనేకంటే మన భాష మీదా, సాహిత్యం మీదా మక్కువ లేదు. ఉన్నా అది ఉచితంగా కావాలి. ఇదీ తెలుగువారి సాహిత్యాభిమానం.
అమెరికా నుండి వెలువడే రీడర్స్ డైజస్ట్ నమూనాలో ఆంధ్రదేశంలో వచ్చే వివిధ పత్రికల్లో వచ్చిన మంచి వ్యాసాలూ, కథలూ ఏర్చి కూర్చి వేయడమూ, తెలుగు డయాస్పోరా కథలూ, వ్యాసాలూ ప్రచురించడమూ ఈ తెలుగునాడి చేస్తోంది. అన్ని వర్గాల పాఠకుల్నీ అలరిస్తూ పాత కొత్త సాహిత్యాల్ని పరిచయం చేస్తోంది. ముఖ్యంగా తెలుగు సినిమా వ్యాసాలు చక్కగా ఉంటాయి. సినిమా సమీక్షలు బావుంటాయి. బాల
 సాహిత్యమంటూ రెండు మూడు పేజీలుంటాయి. అన్నిటికన్నా ముఖ్యం పత్రికకి వాడే పేపరు అత్యంత నాణ్యమైనది.
ఇలా ఎంతో వైవిధ్యంగా ఒక తెలుగు పత్రిక ప్రచురింపబడ్డం చూసి ప్రతీ తెలుగువాడూ గర్వ పడాలి. కానీ అలా లేదు. కనీసం వెయ్యి మంది చందాదార్లు కూడా లేరంటూ వాపోయే పరిస్థితొచ్చింది. పత్రిక మూతబడుతోంది. ఒక పుస్తకం అచ్చువేయడంలో చాలా శ్రముంటుంది. అది కాకుండా అచ్చువేయడానికి డబ్బు చాలకపోతే వచ్చే మానసిక శ్రమ మరింత కుంగతీస్తుంది. ఒక పత్రిక నడపడానికి సాహిత్య తపనొక్కటే చాలదు. తడి
 కూడా కావాలి. అది లేకే తెలుగునాడి శలవు తీసుకుంటోంది.
అమెరికాలో నివాసముంటున్న తెలుగువారందరికీ ఒక విన్నపం. ఎవరైనా ( అంటే కొంతమంది వ్యక్తులైనా, సంఘాలయినా ) ముందుకొచ్చి ఈ తెలుగు నాడికి ఊపిరి పోయండి. అందులో నా వంతు నేనూ పాలుపంచుకుంటాను.
 
పదిమందికీ చెప్పండి.
ఒక తెలుగు పత్రిక అర్థాంతర నిష్క్రమణ్ణి ఆపించండి.
తెలుగక్షరం తలెత్తుకునేలా చూడండి.

No comments:

Post a Comment